కామం తో కళ్ళు మూసుకొని పోయిన ఓ ఇల్లాలు  కట్టు కున్న భర్తేనే హతమార్చేందుకు  కుట్ర చేసింది. ప్రియుడు మోజులో పడిన ఆమె భర్త అడ్డుగా వున్నాడని భావించి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. భర్తపై దాడి చేయించి హతమార్చాలన్న ఆమె ప్రయత్నం బెడిసికొట్టి కటకటాలపాలవ్వాల్సి వచ్చింది.  ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

కొలిమి గుండ్ల మండలం కాల్వటాల గ్రామానికి చెందిన చిన్న సామెలు అనే వ్యక్తి పై గత నెలలో హత్యాయత్నం జరిగింది. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో బాధితుడి భార్యే నిందితురాలిగా తేలింది. 

 పోలీసులు  నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక విషయాలను ఆళ్లగడ్డ డిఎస్పీ పోతురాజు మీడియా వెల్లడించారు.
 తాడిపత్రి మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన మద్ది కెజియా అనే మహిళను నాలుగు సంవత్సరాల క్రితం చిన్న సామేలు వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. 

అయితే  భర్త పిల్లలతో అన్యోన్యంగా  కాపురం చేసుకోవాల్సిన ఆమె గతంలోని ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని  కొనసాగిస్తూ పచ్చని సంసారం లో తనకు తానే నిప్పులు పోసుకొంది. పెళ్లికి ముందు బొందలదిన్నే గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడితో శారీరక సంబంధాన్ని కలిగివున్న ఆమె వివాహం తర్వాత కూడా దాన్ని కొనసాగించింది.

read  more  కృష్ణా జిల్లాలో మైనర్ బాలిక మిస్సింగ్... 11రోజుల తర్వాత... 

అయితే భార్య అక్రమ సంబంధాన్ని పసిగట్టిన భర్త పలుమార్లు మందలించడం జరిగిందన్నారు. దీంతో ప్రియుడి మోజులో మునిగిపోయిన ఆమె అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను చంపేందుకు ప్రియుడు రాజశేఖర్ తో పాటు అతని స్నేహితులైన తలారి సాంబశివ, బోయ నర్సింహారాజు అనే వ్యక్తులతో పథకం రూపొందించింది. 

వీరంతా కలిసి డిసెంబర్ 27న సామేలుపై దాడికి  రెక్కీ నిర్వహించారు. తర్వాతి రోజు డిసెంబర్ 28న హత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. రాంకో సిమెంటు ఫ్యాక్టరీలో సెక్యూరిటి గార్డ్ ఉద్యోగం చేస్తున్న చిన్న సామెలు గత నెల 28న డ్యూటీ ముగించుకొని మోటార్ బైక్ పై ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో కాపు కాచి దాడికి పాల్పడ్డారు. 

బైక్ పై వెళుతున్న వ్యక్తి కళ్ళలో కారంకొట్టి  కత్తులతో నరికి దాడి చేశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సామెలును కొందరు స్థానికులు గుర్తించి తక్షణమే తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగుళూర్ కు తరలించారు. 

దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల వ్యవధి లొనే నిందితులను అరెస్ట్ చేశారు. హత్య యత్నానికి ఉపయోగించిన కత్తులను ,4 సెల్ ఫోన్లు, ఒక యమహ మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

read more  రాజధాని తరలింపుపై కలత: గుండెపోటుతో రైతు మృతి

ఈ కేసులో నిందితులు ప్రధాన నిందితుడైన రాజశేఖర్, సాంబశివ నరసింహ రాజు తో  పాటు హత్య  కుట్ర కు ప్రధాన కారకురాలైన సామెలు భార్య కెజియాను అరెస్ట్ చేసి బనగానపల్లె కోర్టు లో హాజరు పర్చి రిమాండుకు తరలించనున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ పోతురాజు తెలిపారు. మీడియా సమావేశంలో డిఎస్పీతో పాటు కోయిలకుంట్ల సిఐ సుబ్బారాయుడు, కొలిమిగుండ్ల ఎస్సై హరినాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.