గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్తను భార్యే కిరాతకంగా చంపి.. ఆధారాలు తెలియకుండా చెత్తకుప్పలో పూడ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన దొడ్డక ఆంజనేయులు గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు.

భార్య ఆదిలక్ష్మమ్మతో ఆంజనేయులు కొద్దిరోజుల క్రితం గొడవపడటంతో... ఆమె తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని మాచర్లలో వేరుగా నివసిస్తోంది. ఈ నెల 5న ఆంజనేయులు భార్య దగ్గరకు వచ్చాడు. అప్పటి నుంచి అతను అదృశ్యమయ్యాడు.

ఈ క్రమంలో ఆంజనేయులు తమ్ముడు అప్పారావు.. మాచర్లలో ఉంటున్న ఆదిలక్షమ్మ దగ్గరికి వచ్చి.. అన్నయ్య కనిపించడం లేదంటూ బోరుమన్నాడు. తనకేమి తెలియదని ఆమె సమాధానం చెప్పింది..

దీంతో తాను స్టేషన్‌కు వెళ్లి.. కేసు పెడతానని అప్పారావు వెళ్తుండగా ఆదిలక్షమ్మ కంగారుగా.. తానే ఆంజనేయులను చంపి డంపింగ్ యార్డ్‌లో పూడ్చిపెట్టినట్లు చెప్పింది.

అప్పారావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు...పట్టణంలోని మండాది రహదారి పక్కన డంపింగ్ యార్డ్‌కు చేరుకుని.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆదిలక్ష్మమ్మను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.