Asianet News TeluguAsianet News Telugu

మంత్రి పీఏనంటూ బురిడీ... భారీ మోసాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నిందితున్ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 

vamshi krishna reddy arrest in nellore
Author
Nellore, First Published Nov 27, 2019, 10:04 PM IST

నెల్లూరు: మంత్రి పీఏగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపి ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పీఏ అని చెప్పుకుంటూ పలు మోసాలకు పాల్పడిన వంశీకృష్ణా రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితున్ని అరెస్ట్ చేశారు. 

ఇతడు దాదాపు కోటి రూపాయలు పైగా మోసాలకు పాల్పడటమే కాదు పలు నేరాలకు పాల్పడిననట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఇతడు హత్య, అత్యాచారం మరియు కిడ్నాప్ లకు పాల్పడినట్లు నిర్ధారించారు. వంశీకృష్ణా రెడ్డి నుండి ఓ స్కోడా కారు మరియు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని అంతరాష్ట్ర నేరగాడిగా గుర్తించి పిడీ యాక్ట్ పెట్టే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

గుండాల వంశీ కృష్ణ రెడ్డి అనే వ్యక్తి ప్రముఖుల పేర్లు చెప్పి నెల్లూరు, అమరావతి నగరాల్లో పలు మోసాలకు పాల్పడుతున్నాడని ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఉరిబింది మనోహర్ రెడ్డి నెల్లూరు టౌన్ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.   దీంతో కేసు నమోదు చేసుకుని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెంటనే విచారణకు ఆదేశించారు. 

టౌన్ డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అద్వర్యంలో సీసిఎస్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ తో స్పెషల్ టీం ని ఫాం చేసి సత్వర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాసన్ తన  సిబ్బందితో కలిసి దర్యాప్తు జరిపి కేసులోని నేరస్తుడిని అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

వంశీ కృష్ణ రెడ్డిది నెల్లూరు జిల్లా గూడూరు మండలం ఈదూరు గ్రామం. ప్రస్తుతం అతడు నెల్లూరు టౌన్ వేదాయపాలెం వనంతోపు సెంటర్ లో నివసిస్తున్నాడు. 2013  సంవత్సరంలో అతను యాంటీ రేడియేషన్ చిప్ వ్యాపారం చేసి నష్టాలు చవి చూసాడు. ఆ క్రమంలో అక్రమంగా డబ్బు సంపాదించుటకు హత్యలు, అత్యాచారం, నమ్మించి మోసం చేయడం వంటి పలు నేరాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇతను మరొకరితో కలిసి ప్రమాదకరమైన ఆయుధాలతో వేరే వారిని గాయపరిచినట్లు నాయుడుపేటలో కేసు నమోదయ్యింది. అలాగే నోట్ల మార్పిడి సమయంలో రూ.1,000/- నోట్లు, సురక్షితంగా మార్పిస్తానని ఒక పార్టీకి నమ్మబలికి వారి వద్ద నుండి 23 లక్షలు రూపాయలు దోపిడీ చేసిన డెకాయిటీ కేసులో కూడా అరెస్టయ్యాడు. 

2017 వ సంవత్సరం హైదరాబాద్ లో డిల్లీ కి చెందిన ఒక యువతిపై హత్యాచారం చేసిన కేసు బంజారాహిల్స్ పిఎస్ లో ఇతడిపై కేసు నమోదయ్యింది.  ఈ క్రమంలో చంచల్ గూడా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు.   

ఇటీవల వంశీ కృష్ణా రెడ్డి తప్పుడు చిరునామాలతో నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు.  ప్రముఖుల మరియు అధికారుల పేర్లు చెప్పి రాజు అనే వ్యక్తికి మైన్స్ లీజ్ ఇప్పిస్తానని 40 లక్షలు మోసం చేశాడు.  ఇదే విధంగా మరో రెండు సంఘటనలు జరిగి ఉన్నప్పటికీ కేసు నమోదు కాలేదు. 

అదే క్రమంలో ఒక సందర్భంలో ఒక వ్యక్తికి ఆర్వో వాటర్ ప్లాంట్ ఇప్పిస్తానని చెప్పి 35 లక్షలు, మరో సందర్భంలో హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ లడ్డు వేలం విషయంలో మరో వ్యక్తి నుండి 25 లక్షల రూపాయలు మోసం చేసినాడు. 

రాజకీయ నాయకుల మరియు అధికారుల వ్యక్తిగత సహాయకుడిని అని చెప్పి విశాఖపట్నం, హైదరాబాద్ లలో ఈ ఘరానా మోసగాడు ఇప్పటికే కోటి రూపాయలకు పైగా మోసం చేయడం జరిగింది. ఇంకా ఇతడి నేరాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios