టిక్ టాక్ పిచ్చి.. మరో యువకుడి ప్రాణాలు తీసింది. ఇప్పటికే ఈ టిక్ టాక్ యాప్ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా... తాజాగా మరో యువకుడు ఈ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో టిక్ టాక్ వీడియో తీసేందుకు ప్రయత్నించి.. ఓ యువకుడు ఆ నది నీటిలోనే కొట్టుకుపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేసేందుకు దినేష్, గంగాజలం, మనోజ్ గౌడ్ అనే ముగ్గురు యువకులు వాగులోకి దిగారు. టిక్ టాక్ చేసిన తర్వాత చేపలు కూడా పట్టారు. ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వారు ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. అది గమనించిన ఒడ్డున ఉన్న కొందరు.. చీరలు అందించి గంగాజలం, మనోజ్ గౌడ్‌లను కాపాడారు. కానీ వరద ఉధృతికి దినేష్ కొట్టుకుపోయాడు. దీంతో అతడి కోసం వాగులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, దినేష్ కుటుంబసభ్యులు, అధికారులు చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. కాగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న దినేష్ నెల కిందటే సొంతూరుకు వచ్చాడు. మరో నెలలో అతడు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో… తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.