చెక్ పవర్ సర్పంచ్‌లకే ఉండాలి: టీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఫైర్
సర్పంచులకు మాత్రమే చెక్ పవర్ ఉండాలన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. ఖమ్మం ఆర్&బి గెస్ట్ హౌస్‌లో మంగళవారం జరిగిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పంచాయతీరాజ్ ఛాంబర్ల ఉమ్మడి సమావేశానికి పంచాయతీరాజ్ ఛాంబర్ల జాతీయాధ్యక్షుడి హోదాలో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు
సర్పంచులకు మాత్రమే చెక్ పవర్ ఉండాలన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. ఖమ్మం ఆర్&బి గెస్ట్ హౌస్‌లో మంగళవారం జరిగిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పంచాయతీరాజ్ ఛాంబర్ల ఉమ్మడి సమావేశానికి పంచాయతీరాజ్ ఛాంబర్ల జాతీయాధ్యక్షుడి హోదాలో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పూర్తి అవగాహన ఉన్న సర్పంచులతోనే జరుగుతుందని, కనుక సర్పంచులకు ఒక్కరికే చెక్ పవర్ ఉండాలని డిమాండ్ చేశారు.
టీఆరెఎస్ ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 40%నిధులను పంచాయతీలకు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో భారీఎత్తున తెలంగాణాలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, గతంలో సర్పంచ్ తో పాటుగా ఉపసర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారన్నారు.
అయితే 1995 లో చంద్రబాబు, 2007 లో రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంపైన అప్పటి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్ గారి నాయకత్వములో పెద్ద ఎత్తున ఉద్యమం చేశామని ఆయన గుర్తుచేశారు.
ఇప్పుడు మరలా జాయింట్ చెక్ పవర్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం , సర్పంచికి మాత్రమే చెక్ పవర్ ఉండేలా జీఓ ఇవ్వాలని లేదంటే మరలా బాబూ రాజేంద్రప్రసాద్ గారి నాయకత్వములో తెలంగాణా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు పి. అశోక్ రావు గారు, కార్యదర్శి బెల్లం శ్రీనివాసరావు, ఆం.ప్ర రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి, తెలంగాణ ఛాంబర్ కార్యదర్శి జి. కుమార్ గౌడ్, మరియు ఎల్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు