అమరావతి: అణగారిన సామాజిక వర్గాలకు 50శాతం రిజర్వేషన్లంటూ సీఎం జగన్ మాయమాటలు చెబుతూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నాడని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ తెలిపారు. ఆ ముసుగులో ప్రాధాన్యంలేని పదవుల్ని, జీతాలు తక్కువుండే స్థానాల్ని బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చి లక్షలకొద్దీ జీతాలుండే ప్రాధాన్యతా స్థానాల్ని మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టుతున్నారని ఆరోపించారు. 

బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం ఏఏ పదవుల్ని రెడ్లకు కట్టబెట్టిందనే జాబితాను ఆయన విలేకరులకు చదివి వినిపించారు. వైఎస్‌ కుటుంబానికి దగ్గరి బంధువైన తుమ్మల లోకేశ్వర్‌రెడ్డిని ఆర్టీజీఎస్‌ సీఈవోగా, సాక్షిలో క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేసిన తిరుమలరెడ్డిని డీజీపీ వద్ద పీఆర్వో బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. 

ఇక జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారన్నా రు. అలానే గతంలో వైసీపీ సోషల్‌ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన చల్లా మదుసూదన్‌రెడ్డిని రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, అజయ్‌కల్లాంని ప్రభుత్వ సలహాదారుగా, కోడికత్తి గాయానికి కుట్లువేసిన డాక్టర్‌ సాంబిరెడ్డిని వైద్యవిధానమండలి ఛైర్మన్‌గా నియమించారని గిరిధర్‌ పేర్కొన్నారు. 

read more లెగ్‌పీసెస్ జగన్ సామాజికవర్గానికే... అవి మాత్రమే మిగతావారికి: టిడిపి ఎమ్మెల్యే ఎద్దేవా

ఇదేవిధంగా తన సామాజికవర్గానికి చెందిన 51మందికి జగన్‌ కీలక పదవులు కట్టబెట్టాడని... ఇవేనా ఆయన అమలుచేసిన రిజర్వేషన్లని మద్దాలి నిలదీశారు. ఎస్సీ, బీసీల్లో  నిపుణులు, నిష్ణాతులు జగన్‌కి కనిపించక పోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంపై ప్రశ్నించాడన్న అక్కసుతో టీడీపీ సభ్యుడికి మైక్‌ఇవ్వకుండా వైసీపీసభ్యులు అడ్డుకున్నారన్నారు. 

ప్రభుత్వం ఒంటెత్తుపోకడలతో అసెంబ్లీ నిర్వహిస్తోందన్నారు. 50శాతం రిజర్వేషన్లను జగన్‌ ప్రభుత్వం మాటలకే పరిమితం చేసిందనడానికి రెడ్డి సామాజికవర్గానికి కేటాయించిన పదవులే నిదర్శనమన్నారు.

 ఇతర వర్గాలవారు అసమర్థులా : బాల వీరాంజనేయస్వామి

వైసీపీ ప్రభుత్వం సలహాదారులుగా 26మంది, ఛైర్మన్లుగా 25మంది, పరిపాలకపదవుల్లో 21మందితో కలిపి మొత్తం 74మందిని నియమించిందని, ఈ నియామకాల్లో రిజర్వేషన్ల సమస్యలేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని... 74మంది నియామకాల్ని సమర్థిస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి తప్పుపట్టారు. 

రిజర్వేషన్లను పాటించకుండా  చేసినతప్పుని సమర్థించుకుంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలవారు అసమర్థులన్నట్లుగా రాష్ట్రమంత్రి మాట్లాడటం దారుణమన్నారు. మొత్తం 74మందిలో 51మంది జగన్‌ సామాజికవర్గం వారే ఉన్నారని దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీలు, దేవస్థానకమిటీలు, ఇతర అప్రాధాన్య పోస్టులు, నియామకాల గురించిచెప్పడం దారుణమని వీరాంజనేయస్వామి మండిపడ్డారు. 

read more సొంత నియోజకవర్గంలోనే జగన్ పరిస్థితి ఇదీ... ఇక రాష్ట్రంలో...: టిడిపి ఎమ్మెల్యే

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వై.వీ.సుబ్బారెడ్డి ఉంటే ఇతరసభ్యులుగా ఎస్సీ,ఎస్టీ, బీసీల్లో ఏఒక్కరికీ అవకాశమివ్వలేదన్నారు. మహిళల పదవుల్లో కూడావారికి చోటు కల్పించలేదన్నారు. 74మందిలో రిజర్వేషన్లు పాటించని ముఖ్యమంత్రి మేడిపండు చందంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టారన్నారు. 

ఎన్నికల సమయంలో పీకే సలహా ప్రకారం డీఎస్పీల ప్రమోషన్లను తప్పుపట్టిన వైసీపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. జగన్‌ ప్రభుత్వ చేతలు ఒకలా  మాటలు మరోలా ఉన్నాయనడానికి ఈ ఆరునెలల్లో జరిగిన ప్రభుత్వ నియామకాలే నిదర్శనమన్నారు.