కర్నూల్: పుట్టిపెరిగిన ప్రాంతమైన కర్నూలు అభివృద్ధికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని సంకల్ బాగ్ లోని ఎంపీ నివాసంలో తానా బోర్డ్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు టిజి వెంకటేష్ తో పాటు యువ పారిశ్రామికవేత్త భరత్ తో సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా తానా తరఫున కర్నూలు ప్రాంత అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నామని నిరంజన్ ఎంపీకి తెలిపారు. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి ఆయన టీజీ వెంకటేష్ తో చర్చించారు.

అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ... అమెరికాకు చెందిన తానా సంస్థ కర్నూలు ప్రాంత అభివృద్ధికి ముందుకు రావడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి తానా ప్రతినిధులు తనతో చర్చించారని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు ఏ హోదాలో ఉన్నా ,ఏ దేశంలో ఉన్నా తాము పుట్టిపెరిగిన ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. 

read more  ''అవసరమైతే ఎన్డీయేలో చేరతాం'' ఇది హెడ్డింగా...ఇంత దిగజారతారా..?: రామోజీరావుకు బొత్స లేఖ

అనంతరం తానా బోర్డు చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ... తనతో పాటు తానా కార్యదర్శి రవి పొట్లూరి ఆద్వర్యంలో  స్థానిక ఎంపీ టీజీ వెంకటేష్ సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఏ ప్రాజెక్టులు చేపడితే బాగుంటుందన్నదానిపై ఎంపీని సలహాలు, సూచనలు కోరామని ఆయన వివరించారు. 

కర్నూలు అభివృద్ధికి సంబంధించి తాము చేపట్టిన ప్రాజెక్టులకు సహకరించెందుకు టీజీ వెంకటేశ్, టీజీ భరత్ ముందుకురావడం ఆనందంగా వుందని నిరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా జిల్లా కోఆర్డినేటర్  ముప్పా రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.