హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడానికి నూతన గవర్నర్ తమిళ ఇసై సౌందర రాజన్ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. 

బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ దోస్తీకి గవర్నర్ సౌందర రాజన్ వ్యాఖ్యలే ఆధారమని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌పై బీజేపీ పోరాటం నిజమైతే గవర్నర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సిందన్నారు. కానీ ఇప్పటికీ బీజేపీ స్పందించకపోవడం వారి లాలూచీకి నిదర్శనమన్నారు. 

టీఆర్ఎస్‌తో ఉత్తుత్తి ఫైట్ చేస్తూ ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ డబుల్ మైండ్‌ గేమ్‌‌ను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై త్వరలోనే గవర్నర్‌ తమిళ ఇసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.