హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి ఓనరేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ బలోపేతం కోసం ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం డబ్బులు కూడా ఖర్చుపెట్టారని చెప్పుకొచ్చారు. 

ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు అనేది ఆపార్టీలోనే చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎవరు మంత్రులుగా ఉన్నా జనానికి ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. గతంలో తాను బతుకు దెరువు కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. గతంలో తాను మంత్రిగా ఉండి జనానికి ఏం చేశానో అందరికీ తెలుసునన్నారు. 

ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ పై కేసు పెట్టడంపై స్పందించారు జగ్గారెడ్డి. వందల మంది జ్వరాలతో చనిపోతుంటే ఎవరి మీద కేసులు పెట్టాలో చెప్పాలని నిలదీశారు. బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవా అంటూ ప్రశ్నించారు. అధికారులు నిధులు లేవు అంటు మెుత్తుకుంటున్నారని మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కడిగేశారు. ప్రజలు ఎవరిపై కేసులు పెట్టాలని జగ్గారెడ్డి నిలదీశారు.