కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులోని కామనూరు వాగులో  ఆటోతో పాటు ఆరుగురు కొట్టుకుపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

రెండు రోజుల క్రితం దువ్వూరు మండలంలోని గొల్లపల్లిలో ఓ ఫంక్షన్ కు కుటుంబంతో పాటు రామాంజనేయులు వెళ్లాడు. భారీ వర్షాల కారణంగా కామనూరు వాగు ఉప్పొంగింది. దీంతో ఆటో కొట్టుకుపోయింది. 

ఈ ఆటోలో  పోట్లదుర్తికి చెందిన రామాంజనేయులుతో పాటు ఆయన భార్య పెంచలమ్మ, ఆయన తల్లి సబ్బమ్మ, ఇద్దరు కుమార్తెలు మనమడు కార్తీక్ లు ఆటోతో పాటు కొట్టుకుపోయారని పోలీసులు చెబుతున్నారు.

తొలుత ఆటోతో పాటు ముగ్గురు మాత్రమే కొట్టుకుపోయారని భావించారు. కానీ, ఫంక్షన్ కు వెళ్లి ఇంకా తిరిగిరాకపోవడంతో కుటుంబం  అంతా వాగులో కొట్టుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ విషయం తెలిసి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు కొన్ని రోజుల క్రితమే రామాంజనేయులు  కొత్త ఆటోను కొనుగోలు చేసినట్టుగా బంధువులు చెబుతున్నారు.