అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత కారణంగా నిర్మాణరంగం మొత్తం స్తంభించింది. దీంతో ఈ రంగంపైనే ఆధారపడ్డ కార్మికులు రోడ్డునపడ్డారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో నిస్సాయులైన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా రోజురోజుకు కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతుండటంతో స్పందించిన ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉద్యమానికి సిద్దమైంది. 

ఈ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు తాజాగా ఈ తమ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఇసుక కొరతపై ప్రభుత్వం ఇన్నాళ్లు చర్యలు తీసుకుంటుందని వేచి చూశామని ఇకపై తాడో పేడో తేల్చుకుంటామని ఆయన తెలిపాడు.

read more video: దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్

నవంబర్ 1వ తేదీన విజయవాడలో సామూహిక రాయబార సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రాయబార సభకు రాష్ట్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానిస్తున్నామని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలపై పెట్టిన శ్రద్ధ ఇసుక సరఫరాపై పెట్టడం లేదని ఆరోపించారు. దీంతో ఆన్ లైన్ లో అమ్మకానికి పెడుతున్న ఇసుకను వైసీపీ దళారులే బుక్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని...ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల 35 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. 

read more   ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మాజీకి జనసేన అండ.. పవన్ విరాళం

రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా ఏకంగా ఐదుమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మరింతమంది కార్మికలు అఘాయిత్యాలకు పాల్పడకుండా వుండాలంటే ప్రభుత్వం వెంటనే ఇసుక కొరతను నివారించాలని సూచించారు. 

ఇసుక క్వారీలు ప్రారంభించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించినా ఫలితం లేదన్నారు. పనులు లేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు నెలకు 10 వేలు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు.