కర్నూల్:  జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో రోజురోజుకు అల్లరిమూకల ఆగడాలు ఎక్కువవున్నాయి. ఇందుకు డోన్ పట్టణంలో గతకొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే ప్రత్యక్ష సాక్షం. కారణాలు వేరువేరుగా వున్నా గత నాలుగు రోజులుగా పట్టణంలోని ఏదోఒకచోట హింస చేలరేగుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

శుక్రవారం అర్థరాత్రి కొందరు అల్లరిమూకలు నడిరోడ్డపై నానా హంగామా సృష్టించి నలుగురు యువకులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. చిగురుమానుపేటలో పీరీల విషయంలో జరిగిన చిన్న గొడవ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంది. కొందరు యువకులు అదే కాలనీకి చెందిన సురేష్, వినోద్, ప్రకాశం, అనే యువకులపై కత్తులతో దాడి చేశారు.

అయితే ఈ దాడిలో  స్వల్పంగా గాయపడ్డ యువకులు స్థానిక ఆస్పత్రిలలో చికిత్స పొందుతున్నారు. అర్థరాత్రి సమయంలో నడిరోడ్డుపై జరిగిన ఈ దాడితో స్థానికుల్లో భయాందోళన మరీ ఎక్కువయ్యింది. 

వైఎస్ జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే రాపాక క్షీరాభిషేకం ...

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే  హరికృష్ణ అనే యువకుడిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. పట్టణంలో తారకరామానగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ వెళ్తున్న హరికృష్ణను అడ్డుకున్న  దుండగులు బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో అతడి గొంతు, కడుపు బాగాల్లో  తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. 

గత వారంరోజులుగా డోన్ పట్టణంలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణంగా మారింది. వారం రోజుల కిందట పట్టణంలోని విజయ పాల డైరీ సమీపంలో నిలిపిన కార్లను గుర్తుతెలియని దుండగులు  ద్వంసం చేశారు.  కార్ల అద్దాలు పగలగొట్టి సీట్లపై పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో కొన్ని కార్లు పాక్షికంగా కాలిపోయాయి. 

అలాగే రెండు రోజుల క్రితం తారకరామనగర్ లో తాగుబోతుల వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళుతున్న తండ్రి, కొడుకులపై బ్లేడ్ లతో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది.ఈ ఘటనలను మరువకముందే నిన్న రాత్రి మరో రెండు సంఘటనలు అలాంటివే జరిగాయి. 

దేవాదాయ శాఖలో భారీ ఉద్యోగ భర్తీకి ఏర్పాట్లు..: మంత్రి వెల్లంపల్లి...

పట్టణంలో రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువవడంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఇంట్లోంచి  బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. స్ధానిక పోలీసులు ఇలాంటి  అల్లరిమూకలను అదుపుచేయడంలో విఫలమవడం వల్లే శాంతిభద్రతలు  దెబ్బతిన్నాయని స్థానిక  ప్రజలు ఆరోపిస్తున్నారు.

డోన్ స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇలాంటి చోట రోజురోజుకు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుండటం సర్వత్రా విమర్శలు దారితీస్తోంది.