ఖమ్మం: ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ప్రమాదం సంభవించింది. కారు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో 9 నెలల గర్భవతి, ఆమె అత్త దుర్మరణం పాలయ్యారు. గర్భవతి భర్త కారు అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు.

మరణించిన గర్భవతికి శస్త్రచికిత్స చేసి బేబీని ప్రాణాలతో బయటకు తీయడానికి వైద్యులు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఖమ్మం పట్టణం శివారులోని గొల్లగూడెం గ్రామం వద్ద ఆ ప్రమాదం సంభవించింది. 

గర్భవతి భర్త పి. మహిపాల్ రెడ్డి కారును నడుపుతుండగా ప్రమాదం సంభవించింది. మహిపాల్ రెడ్డి మహబూబాబాద్ ట్రాన్స్ కోలో అసిస్టెంట్ ఇంజనీరు. కారులో పి. మహిపాల్ రెడ్డి తన భార్య, తల్లితో కలిసి ఖమ్మం నుంచి మరిపెడలోని తమ ఇంటికి బయలుదేరాడు.

మహిపాల్ రెడ్డి భార్య స్వాతి (28) తొమ్మిది నెలల గర్భవతి. ఆదివారం ఉదయం అతను తన భార్యతో, తల్లి ఇందిరితో కలిసి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లాడు. భార్య మెడికల్ చెకప్ కోసం ఖమ్మం వచ్చాడు. డీసెంటరీతో బాధపడుతున్న మహిపాల్ రెడ్డి కారును సాగర్ కాలువకు దగ్గరగా ఒడ్డున ఆపేందుకు ప్రయత్నించాడు. కారు కాలువలోకి జారి పడింది.

కాలువలో దుస్తులు ఉతుకుతున్న మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వెంటనే వచ్చి కారులోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న మహిపాల్ రెడ్డి వైపు చీరను విసిరారు. ఆ చీరను పట్టుకుని రెడ్డి బయటకు వచ్చాడు. 

కారు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు కూడా కాలువలో మునిగిపోయారు. స్థానికుల సాయంతో మహిళల శవాలను పోలీసులు కారు నుంచి బయటకు తీశారు.