హైదరాబాద్ మెట్రో రైలులో కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. పీకల దాకా మద్యం సేవించి మెట్రో రైలు ఎక్కాడు. అక్కడితో ఆగకుండా... తాగిన మైకంలో మెట్రో రైలులో చిందులు వేశాడు. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాడు. తన ఫోన్ లో సెల్ఫీలు దిగడంతోపాటు... తోటి ప్రయాణికులను కూడా ఫోటోలు తీశాడు. కాగా... అతను మెట్రోలో తాగి డ్యాన్స్ వేయడాన్ని ఓ వ్యక్తి వీడియో తీయగా... అది వైరల్ గా మారింది.

ఆ ప్రయాణికుడు చేసిన హంగామాకి ఇబ్బంది పడిన కొందరు ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే... అప్పుడు అతను మెట్రో సెక్యురిటీ సిబ్బందికి దొరకకుండా తప్పించుకున్నాడు. కాగా... అతనిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు. మెట్రో సీసీకెమేరాలో రికార్డు అయిన వీడియో ఆధారంగా అతనిని పట్టుకున్నట్లు మెట్రో అధికారులు చెప్పారు.

సీసీకెమేరాలో రికార్డు అయిన వీడియోని ఆధారంగా చేసుకొని.. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి అతనిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితుడు ఉస్మానియా యూనివర్శిటీ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు శీలం కనకరాజుగా గుర్తించారు. అతను సనత్ నగర్ కంటైనర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.