చేవెళ్ల: వికారాబాద్ జిల్లా చేవెళ్లలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పరిగి శాసనసభ్యుడు కొప్పుల మహేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి చేసిన ప్రయత్నంలో ఈ ప్రమాదం సంభవించింది. 

మహేష్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పరిగి నుంచి హైదరాబాదు వెళ్తున్నారు. ఈ క్రమంలో చేవెళ్లకు చెందిన టేకులపల్లి మల్లేష్ తన కారులో వెళ్తున్నారు. ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎమ్మెల్యే వాహనం మల్లేష్ కారును ఢీకొట్టింది. 

దాంతో మల్లేష్ కారుతో పాటు మహేష్ రెడ్డి వాహనం కూడా పల్టీ కొట్టాయి. దీన్ని గమనించిన స్థానికులు 108కి, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన ఎమ్మెల్యేను మరో కారులో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహేష్ రెడ్డి అపోలోలో చికిత్స పొందుతున్నారు.