నిజామాబాద్: ఇటీవలి సహకార ఎన్నికల్లో విజయం సాధించడానికి పంచిన డబ్బులను, ఖరీదైన బహుమతులను తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకోవాలని ఓటమి పాలైన పాశం నర్సిములు అనే నాయకుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో జరిగిన సహకార ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 

తనకు ఓటేయలేదు కాబట్టి తాను ప్రచారంలో ఇచ్చిన డబ్బులను, బహుమతులను తిరిగి ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఫలితాలు వెలువడిన తర్వాత విచిత్రంగా ఆయన పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ వెళ్లి తాను ఇచ్చిన డబ్బులను, బహుమతులను తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. 

విచిత్రంగా కొంత మంది డబ్బులు తిరిగి ఇచ్చారని, కొంత మంది వాదనలకు దిగుతున్నారని ఆయన అన్నారు. నర్సిములుకు గ్రామ రాజకీయాల్లో అనుభవం ఉంది. గతంలో ఆయన ఇందల్వాి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పనిచేశారు. తాజాగా ఆయన ఓటమి పాలయ్యారు. 

మొత్తం 98 ఓట్లు ఉండగా విజేత 79 ఓట్లు పొందాడు. మరో అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. నర్సిములుకు ఏడు ఓట్లు వచ్చాయి. ఎన్నికలకు ముందు అతను ఓటుకు 3 వేల రూపాయల చొప్పున, ప్రతి మహిళకు ఒక చీర చొప్పున పంచినట్లు ప్రచారం జరుగుతోంది.