దేశంలోని కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చింది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలి జరిమానా  విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డ అతనికి రూ.10,000 జరిమానా విధించారు. గతంలో ఇది రూ.2000గా ఉండేది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌‌లో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. మంగళవారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు

అయితే.. అది అతని తొలి నేరంగా భావించిన జడ్జి పదివేలు జరిమానా విధించారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 15 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ అవ్వకుండానే .. కొత్త చట్టాన్ని ఎలా అమలు పరుస్తారన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. 

దీనిపై నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ను మీడియా ప్రశ్నించగా.. డ్రంక్ డ్రైవ్ కేసుల్లో కోర్టు ఆదేశాలకనుగుణంగా వెళతామని.. దానికి వాహన చట్టంతో ఎలాంటి సంబంధం ఉండదని ఆయన చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం తదితర కేసుల్లో జీవోను అనుసరించే చలానాలు ఉంటాయని ఆయన వివరించారు.