ఒకపక్క దిశ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మహిళలపై ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తల్లీబిడ్డలను దారుణంగా హత్య చేసి, అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం మద్దిపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల మధ్య రోడ్డు పక్కన కాల్చిన స్థితిలో ఉన్న మహిళ, చిన్నారి మృతదేహాలను కొందరు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన మహిళ తల వెనుక రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన పోలీసులు... ఆమెను రాయితో కొట్టి చంపివుంటారని భావిస్తున్నారు. అలాగే ఆమె ఏడాది వయసున్న కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతురాలు ఎవరు... ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.