ఏదుల రిజర్వాయర్ పూర్తయితే వనపర్తి జిల్లాకు మహార్ధశ వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు   ప్రభుత్వం తరపున ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ కింద ముంపుకు గురవుతున్న కొంకలపల్లి, బండరావిపాకుల గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటిస్తూ జీఓ 500 విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. 

రేవల్లి మండలం కొంకలపల్లికి చెందిన 269 కుటుంబాలకు, బండరావిపాకుల 729 కుటుంబాలకు పరిహారం అందించడం కోసం రూ.140.19 కోట్లు విడుదల చేస్తూ శనివారం ప్రభుత్వం జీఓ 500 విడుదల చేసింది. మరియు ఆర్ & అర్ సెంటర్ అభివృద్ది పనులకు ప్రభుత్వం రూ.55.77 కోట్లు విడుదల చేసింది. దీనికి కృషిచేసిన సీఈ రమేష్ మరియు ఏదుల రిజర్వాయర్ ఇంజనీరింగ్ సిబ్బందిని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభినందించారు. 

ఏదుల రిజర్వాయర్ తో వనపర్తి రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాంతంలో 365 రోజులు చెరువులు నీటితో కళకళలాడుతాయని, త్వరలో ఆర్&ఆర్ పనులకు మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపన చేస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. 

ఆదివారం మధ్యాహ్నం ఆయన గోపాల్ పేట మండలం మున్ననూరు నుండి వనపర్తి  ఈదుల చెరువు, తాళ్ల చెరువుకు నీళ్లు వచ్చే ఎంజె 3 ఎ కాలువ పనులను పరిశీలించి, కృష్ణా నీళ్లతో అలుగు పారుతున్న వనపర్తి మండలం కాశీంనగర్ చెరువుకు పూలు చల్లి పూజలు చేశారు.