భర్త, ఆడపడుచు, అత్తమామలు పెట్టిన వేధింపులు తట్టుకోలేకపోయింది. పెళ్లై కనీసం రెండు సంవత్సరాలు కూడా గడవకముందే శవంగా మారింది. అది కూడా పుట్టింటికి వచ్చి... అక్కడే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బర్కత్ పుర ఆర్టీసీ డిపో లైన్ లో ఎల్లయ్య, సత్తెమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె గౌతమి(31)కి సికింద్రాబాద్ గాస్ మండిలో ఉంటున్న కర్నె మధుకర్ తో 14నెలల క్రితం వివాహం జరిపించారు. అతడు ఓ కొరియర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. గౌతమి ఏపీఎస్‌సీఆర్‌ఐసీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. వివాహ సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 15 లక్షల కట్నం ఇచ్చి రూ. 5 లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి జరిపించారు.

కాగా... పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త, అత్తమామలు, ఆడపడుచు... రోజుకో విధంగా గౌతమిని వేధించేవారు. ఈ వేధింపులు రోజూ తీవ్రతరం కావడంతో.. ఆమె వాటిని తట్టుకోలేకపోయింది. దీంతో బోనాల పండగ సమయంలో... ఆమె పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి అత్తారింటికి తిరిగి వెళ్లలేదు. దీంతో... ఇటీవల గౌతమి అత్తమామలు ఆమె పుట్టింటికి వచ్చి మరీ తీవ్రంగా దుర్భాషలాడారు. తనతోపాటు తన తల్లిదండ్రులను కూడా తిట్టడంతో ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైంది.

మంగళవారం ఉదయం ఆమె తల్లి తమ ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో పని చేయడానికి వెళ్లింది. తండ్రి ఎల్లయ్య నిద్రలో ఉన్నాడు. అప్పటి వరకు తండ్రి పక్కనే నిద్రపోయిన గౌతమి ఉదయం 6 గంటలకు వేరే గదిలోకి వెళ్లి గడియపెట్టుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. కిటికీ నుంచి పొగరావడం, ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న యువకులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.
 
అప్పటికే పూర్తిగా కాలిపోయి గౌతమి చనిపోయింది. సమాచారం అందుకున్న కాచిగూడ ఏసీపీ సుధాకర్‌, సీఐ హబీబుల్లాఖాన్‌, డీఐ యాదేందర్‌, అడ్మిన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి భర్త, అత్త, ముగ్గురు ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.