పాత కక్షల కారణంతో... ఓ వ్యక్తిని సొంత బంధువులే అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహానికి నిప్పు పెట్టి అంటించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకోగా... పోలీసులు చాకచక్యంగా కేసును చేధించారు.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే... హయత్ నగర్ కి చెందిన జక్కుల కిషన్(42)కి పెళ్లయ్యింది. కాగా... భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు మీనాక్షి, అరుణ్ తో  కలిసి నివసిస్తున్నాడు. రోజూ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు ఇద్దరినీ చదివిస్తున్నాడు.  కాగా... గత నెల 31వ తేదీన కిషన్ చుట్టాల ఇంటికి అని చెప్పి బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆయన కుమార్తె మీనాక్షి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... కిషన్ మృతదేహాన్ని సగం కాలిన దశలో గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా... బందువులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో ఉన్న పాతకక్షలను మనసులో పెట్టికొని కిషన్ ని అతని బంధువులే అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

గొడ్డళ్లు, కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహానికి నిప్పు అంటించి కాల్చివేసినట్లు చెప్పారు. అయితే... మృతదేహం సగమే కాలడంతో... పోలీసులు అది కిషన్ దిగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా... అనారోగ్యంతో తల్లి... ఇప్పుడు బంధువుల చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. తండ్రి మరణవార్త విని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.