కర్నూల్: టిడిపి ఎమ్మెల్సీ, తన సోదరుడు కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామాపై మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విచిత్రంగా స్పందించారు. ప్రభాకర్ పార్టీ మార్పుపై తనకెలాంటి  సమాచారం లేదని... ఈ విషయంపై అతడు తనతో మాట్లాడలేదని అన్నారు. అతడు అధికార వైసిపిలోకి వెళ్లనున్నట్లు మీడియా కధనాల ద్వారానే తెలిసిందని... ఆ పార్టీలో చేరడంపై తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. 

అధికార  వైసిపి ఎన్నికల్లో అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు కేఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. డోన్ లో నిన్న రాత్రి  కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థుల ఇంటికి వెళ్లిమరీ పోలీసులు మహిళలను,  కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి  చేశారని... స్థానిక మంత్రి ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేశారని ఆరోపించారు. అధికారం వుందని ఇలా ప్రత్యర్థులను బెదిరించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్ గా పోటీచేసే అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని... అందువల్లే ఈ మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మాజీ  కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చైర్మన్‌ పదవిని, 32 వార్డులు దానం చేస్తున్నామని కృష్ణమూర్తి అన్నారు.