వైఎస్ జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే రాపాక క్షీరాభిషేకం
వైఎస్ జగన్ ఫ్లెక్సీకి అమలాపురంలో జరిగిన క్షీరాభిషేకం కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర అందించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన కార్యక్రమంలో జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం సొంత ఆటోలు కలిగి ఉన్న డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించడంపై ది సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ కు చెందిన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వారికి ఆర్థిక సాయం అందించారని అన్నారు.
ఆటో రిక్షా కార్మికుల సంక్షేమానికి సిఎం జగన్ కృషి చేయడదం అభినందనీయమని రాపాక వరప్రసాద రావు అన్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లబోయిన శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ పేరు మీద లేదా అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆటోలుంటే డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద పది వేల రూపాయలు అందుతాయి. బ్యాంక్ ఖాతా మాత్రం ఆటో యజమాని పేరుతోనే ఉండాలి.