హౌస్ కీపింగ్ చేస్తూ... జీవితం సాగించే ఓ మహిళకు ఎలాగైనా డబ్బులు సాధించాలని భావించింది. తనకంటూ ఓ విలాసవంతమైన జీవితం గడపాలని ఆశపడింది. అందులో భాగంగా దొంగగా మారింది. తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసి దోచుకోవడం మొదలుపెట్టింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరానికి చెందిన పసుపుల కల్పన అలియాన్ మల్మమ్మ(37) హౌస్‌కీపింగ్‌ పని చేస్తోంది. విలాసవంతమైన జీవితం గడపాలని భావించి చోరీలు చేయడం ప్రారంభించింది. తాళం వేసిన ఇళ్లలో 2008 నుంచి చోరీలు చేస్తోంది. పోలీసులకు పట్టుబడకుండా తరచూ ఇళ్లు మారుతూ ఉంటుంది.
 
బేగంపేటలో 6, కుషాయిగూడ-2, నాచారం పోలీ్‌సస్టేషన్‌లో-5 కేసులు ఆమెపై ఉన్నాయి. ఈ నెల 19వ తేదీన మార్కెట్‌ పీఎస్‌ పరిధిలోని ఆదయ్యనగర్‌లో ఓ ఇంటితాళం పగులగొట్టి వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు అపహరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా, పాత నేరస్థుల వేలిమద్రల ఆధారంగా ఆమెను ఆదివారం రసూల్‌పురాలో అదుపులోకి తీసుకున్నారు.