ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రాగల 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి ప్రకటించింది. అందువల్ల ప్రమాదం పొంచివున్న జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగంగో పాటు ప్రజలు అప్రమత్తంగా  వుండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. 

రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతిభారీతో పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండి వెల్లడించింది.

ఈ నేపథ్యంలోప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు ఆదేశించారు. తమ శాఖ తరపున కూడా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమీషనర్ తెలిపారు. 

గాలి, ఉరుములతో కూడిన వర్షాలు ప్రజలు, వరదనీటితో ఇప్పటికే ఏపి అతలాకుతలమైంది. నిన్న రాత్రి విజయవాడ ప్రాంతంలోని అవనిగడ్డలో కుండపోతగా వర్షం కురిసి ప్రభుత్వ కార్యాలయాల లోపల అడుగుపైగా వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.