అతడు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులు తప్పు చేస్తే బుద్దిచెప్పాల్సిన అతడే  బుద్దితక్కువ పని చేశాడు. తన వద్ద చదువుకునే చిన్నారులను కన్న బిడ్డల మాదిరిగా చూసుకోవాల్సింది కామవాంఛతో చూశాడు. అతడి దుర్బుద్దిని గుర్తించిన బాలికలు కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని చెప్పడంతో సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు.

ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా  రాజోలు  మండలం బిసావరంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కె.సుబ్రహ్మణం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే అతడే పాఠశాలలో చదువుకునే అమ్మాయిలతో నిత్యం అసభ్యంగా ప్రవర్తించేవాడు.  అతడి చేష్టలను కొన్నాళ్లనుండి భరిస్తూ వచ్చిన చిన్నారులు చివరకు వాటిని భరించలేక కుటుంబసభ్యులకు తెలియజేశారు. 

దీంతో శుక్రవారం పాఠశాలవద్దకు చేరుకున్నచిన్నారుల తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. అంతటితో ఆగకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ కామాంధున్ని కటకటాల్లోకి నెట్టారు. 

విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయున్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు విద్యార్థులను లైంగికంగా వేధించాడా... లేదా అన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు.... తప్పు చేసినట్లు తేలితే తగినవిధంగా కేసు నమోదు చేసి శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.