విశాఖపట్నం:  విశాఖ భూ కుంభ కోణంలో ప్రధాన  పాత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ లేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. లోకేష్ కు మాటలు రావు గానీ మూటలు సర్దడం చాలాబాగా వచ్చిని...ఇది విశాఖ భూకుంభకోణంలో బయటపడిందని ఎద్దేవా చేశారు. 

గతంలో ఈ భుకుంభకోణంపై ఏర్పాటుచేసిన సిట్ నివేదిక బయట పెట్టమని అప్పటి ప్రభుత్వాన్ని ప్రతి పక్ష వైఎస్సార్‌సిపి తరపున చాలాసార్లు డిమాండు చేశారు. కానీ చంద్రబాబు సారథ్యంలోని టిడిపి సర్కారు స్పందించ లేదు. అప్పటి క్యాబినెట్ మంత్రి  గంటా కూడా నివేదిక బయట పెట్టమని కోరమని...ఆయన కూడా స్పందించలేదని గుర్తుచేశారు. 

విశాఖలో నిర్మించిన టిడిపి కార్యాలయ భవనం కూడా భూ కుంభ కొణంలో భాగమేనని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణకు కూడా తాజాగా ఏర్పాటుచేసిన సిట్ ని ఆశ్రయిస్తామన్నారు. 

 విశాఖ భూకుంభకోణంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ పేరున్నట్టు బాగా ప్రచారం జరిగింది. ఇందులో నిజంగా ఎవరి పాత్ర వున్నా తప్పకుండా చర్యలు తీసుకోవలని సిట్ ను కోరతామన్నారు. 

విశాఖలో ల్యాండ్  పూలింగ్ పేరిట 600 నుంచి 700 కోట్ల  విలువైన భూములు టిడిపి నాయకులు సొంతం చేసుకున్నారు.. టిడిపి నాయకుల దోపిడిపై విచారణ జరిపించడం తప్పా...? అని ప్రశ్నించారు.

విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

టిడిపి విశాఖ ఎంపీ అభ్యర్ధి, లోకేశ్ తోడల్లుడు భరత్ బ్యాంకులకు సొమ్ము ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.. అతడి ప్రయత్నాలను ఆపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 

 విశాఖ భూముల  పరిరక్షణకు సీఎం జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నారని...అందుకే టిడిపి హయాంలో జరిగిన భూ దోపిడి పై విచారణకు సిట్ ను నియమించారన్నారు. హుద్ హుద్ తుఫాను అనంతరం విశాఖలో కీలక రికార్డులు తారుమారు అయ్యాయని ఆరోపించారు. 

విశాఖ జరిగిన ఈ భూ కుంభకోణం  దేశంలోనే అతి పెద్దదని అన్నారు. తాజాగా ఏర్పాటుచేసిన సిట్ ముందుకు ప్రజలు రావాలని... తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేయండని అమర్నాథ్ సూచించారు.