ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ బుధవారం నాడు జిల్లా ఎస్పీ నవదేవసింగ్ ఎదుట లొంగిపోనున్నారు.దళితులను కులం పేరుతో దూషించారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.

ఈ కేసు విషయమై చింతమనేని ప్రభాకర్  హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు.బుధవారం నాడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ ను తాను రద్దు చేసుకొని  చింతమనేని ప్రభాకర్ ఎస్పీ ఎదుట బుధవారం నాడు లొంగిపోనున్నారు. 

తప్పు చేసినందునే మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా చింతమనేని ఎస్పీ ఎదుట లొంగిపోతానని ప్రకటించారు. 

తాను ఏ తప్పు చేయలేదని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 100 రోజుల వరకు తాను బయటకే అడుగుపెట్టలేదని ఆయన గుర్తు చేశారు.చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు 12 పోలీసు బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి.

10 రోజుల క్రితం దెందులూరు నియోజకవర్గంలోని పనిమికిడి గ్రామస్తులు తమను కులం పేరుతో దూషించారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన రోజు నుండి చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.