తన ఇంటికి, వ్యవసాయానికి ఆసరాగా ఉన్న ఆవు యజమానిని హతమార్చింది. కొమ్ములతో పొడిచి, గుండెలపై కాళ్లతో తొక్కి చంపింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన పందుల పాపయ్య తనకున్న రెండెకరాలతో పాటు మరో పదెకరాల పోలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.

ఈ క్రమంలో పొలం పనుల కోసం ఏడాది క్రితం ఒక ఎద్దుతో పాటు ఒక ఆవును కూడా కొనుగోలు చేశాడు. ప్రతిరోజు వాటితో పనులు చేయించుకుని బావి వద్దనే కొట్టంలో కట్టేసేవాడు. ఆవు పాలు కూడా ఇచ్చేది... ఆదివారం రాత్రి పాపయ్య వ్యవసాయ బావి వద్దనే పడుకుని ఉదయాన్నే పాలు పిండుకుని వచ్చేవాడు.

Also read:దక్షిణాదిలో రెండో రాజధాని ఛాన్స్ లేదు: తేల్చేసిన కేంద్రం

ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడికి వెళ్లిన అతను మంగళవారం ఉదయం ఇంటికి రాకపోవడంతో పాపయ్య కుమారుడు నరేశ్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పొలం వద్ద తండ్రి తీవ్రగాయాలతో విగతజీవిగా పడివున్నాడు.

అదే సమయంలో తండ్రి మృతదేహం పక్కనేవున్న ఆవు నరేశ్ వెంటపడటంతో అతను తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం గ్రామస్తులను వెంటబెట్టుకుని తిరిగి బావి వద్దకు వెళ్లి.. ఆవును బంధించి చెట్టుకు కట్టేశారు.

Also Read:ఢిల్లీ కేంద్రంగా వైసీపీలో కుదుపు: ఆ ఎంపీ వల్ల జగన్ కు టెన్షన్

ఆవుకు నీళ్లు పట్టించే సమయంలో పాపయ్యని పొడిచి కింద పడేసి గుండెపై కాళ్లతో తొక్కడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పాపయ్యకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.