నాగర్ కర్నూల్: టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు. 

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపల్లి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. 


తాను టీఆర్ఎస్ పార్టీ వీడతానంటూ వస్తున్న వార్తలను ప్రజలు నమ్మువద్దని కోరారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. 

ఇకపోతే పదవులు రాకపోవడంతోపాటు, కేబినెట్ లో బెర్త్ లు దక్కకపోవడంతో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులు అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. 

కేబినెట్ కూర్పు అనంతరం మల్కాజ్ గిరిలో మైనంపల్లి హన్మంతరావు కార్యాలయంలో ఈ ముగ్గురు నేతలు సమావేశమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ ముగ్గురు నేతలు బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

సెప్టెంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు.