ఆదిలాబాద్: మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న అలకపాన్పు ఎక్కారు. కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి బెర్త్ దక్కకపోవడంతో అలకబూనారు. కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఆదివారం మంత్రి వర్గ విస్తరణలో జోగు రామన్నకు బెర్త్ కన్ఫమ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా సత్యవతి రాథోడ్ తెరపైకి రావడం, కేబినెట్ లో బెర్త్ దక్కించుకోవడంతో జోగు రామన్న ఆశలు ఆడియాశలు అయ్యాయి. 

కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో జోగు రామన్నకు అవకాశం కల్పించలేదు. అయితే ఆదివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని జోగు రామన్న భావించారు. 

అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అలిగినట్లు తెలుస్తోంది. కనీసం కుటుంబ సభ్యులకు సైతం చెప్పకుండా బయటకు వెళ్లినట్లు సమాచారం. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో జోగు రామన్న ఎక్కడకు వెళ్లారా అన్నచర్చ జరుగుతోంది. ఇకపోతే కేసీఆర్ కేబినెట్లో జోగు రామన్న పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.