మరో కీచక ఉపాధ్యాయుడి బాగోతం వెలుగులోకి వచ్చింది.  కాలేజీలో విద్యార్థులను లైంగిక వేధించడంతోపాటు... తన కోరిక తీర్చకుంటే.. జీవితాంతం పరీక్షల్లో  పాస్ కానివ్వనంటూ బెదిరించేవాడు. ఆ బెదిరింపులకు చాలా మంది కాలేజీ అమ్మాయిలకు అతనికి లొంగిపోవడం గమనార్హం. కాగా.. ఓ యువతి మాత్రం అతని చర్యలను పోలీసుల ముందు ఎండగట్టింది. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకోగా... ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మచిలీపట్నంలోని సారా గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్ కోర్సు లో చేరింది. రెండు సంవత్సరాలపాటు అన్ని సబ్జెక్టులూ పాస్ అవుతూ వచ్చింది. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత కాలేజీ కరస్పాండెంట్ రమేష్ కన్ను ఆ విద్యార్థినిపై పడింది. ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

తన కోరిక తీర్చకుంటే జీవితంలో పరీక్షల్లో పాస్ కాకుండా చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో మూడో సంవత్సరం ఓ సబ్జెక్ట్ లో ఫెయిల్ చేశాడు. సప్లమెంటరీ పరీక్ష రాసినా.. మళ్లీ ఫెయిల్ చేశాడు. దీంతో... అతని వేధింపులు తట్టుకోలేకపోయిన యువతి  పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.