Asianet News TeluguAsianet News Telugu

జేసికి మరో షాకిచ్చిన జగన్... ఈసారి సిమెంట్ కంపనీపై

రాయలసీమ టిడిపి నాయకులు, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇంతకాలం అతడికి సంబంధించిన జేసి ట్రావెల్స్ పై మాత్రమే చర్యలు తీసుకున్న ప్రభుత్వం  తాజాగా ఇతర వ్యాపారాలపై కూడా చర్యలు ప్రారంభించింది. 

CM Jagan Gives Another Big Shock To  jc diwakar reddy
Author
Anantapur, First Published Jan 31, 2020, 5:45 PM IST

అమరావతి: మాజీ ఎంపీ, రాయలసీమకు చెందిన సీనియర్ టిడిపి నాయకులు జేసి దివాకర్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటివరకు అతడి ట్రావెల్స్ పై దృష్టిపెట్టి బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి సంబంధించిన ఇతర వ్యాపారాలపై కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా  అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గతంలో ఇచ్చిన లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. 

యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బిలో ఉన్న  649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులను గతంలో జేసికి చెందిన మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజుకు పొందాయి. తాజాగా ఆ లీజును జగన్ సర్కార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

ఈ సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆదేశాల్లో పేర్కోంది. 

ప్రభుత్వం లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కోంది.   

read more  కరోనా వైరస్ సోకినట్లు అనుమానమా... అయితే మీరు చేయాల్సిందిదే: మంత్రి నాని

ఇప్పటికే జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ ను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా జేసి బ్రదర్స్ కు సంబంధించిన 8 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. 

నిబంధనలకు విరుద్దంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని ఆర్టీఏ అధికారులు గుర్తించారు.  మెుత్తానికి 8 బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికుల నుంచి దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేసినట్లు చెప్పుకొచ్చారు. 

read more  వాల్తేరు క్లబ్ జోలికొస్తే... జగన్ ఏం చేయాలంటే... : గంటా సూచన

 ఇకపోతే అనంతపురం జిల్లాలోని హిందూపురంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 15 బస్సులను తనిఖీ చేయగా వాటిలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని గుర్తించారు. అందులో భాగంగా 35 వేల జరిమానాను సైతం అధికారులు విధించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios