కాకినాడ: ప్రజా చైతన్య యాత్ర అని ప్రారంభించిన చంద్రబాబు మళ్లీ అబద్ధాలు, అవాకులు, చెవాకులు పెలుతూ ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు మండిపడ్డారు. సోమవారం  ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే పట్టుమని 10 మంది కూడా చంద్రబాబు వెంట లేరని మంత్రి  ఎద్దేవా చేశారు. 

ఇక ట్రంప్ భారత పర్యటన సందర్భంగా చంద్రబాబుపై సోషల్ మీడియాలో  ప్రచారమవుతున్న వార్తల గురించి కన్నబాబు ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి నేతగా చెప్పుకునే చంద్రబాబు గురించి ట్రంప్ విమానం దిగగానే ప్రధాని మోదీని అడిగినట్లుగా సైటైర్లు పేలుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతోందని అన్నారు. 

ఇక చంద్రబాబును జగన్ ఓడించినందుకు ట్రంప్ కు కోపం వచ్చివుంటుందని చంద్రబాబు సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుందని అన్నారు. అందువల్లే డిల్లీలో జరిగే విందుకు జగన్ కు ఆహ్వానం లభించలేదని ప్రచారం చేస్తున్నారని.. ఇలా తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గులేదా అని విమర్శించారు. అయినా దేశాధినేతల పక్కన తిరగడం కంటే  ప్రజల్లో తిరగడాన్నే జగన్ ఇష్టపడతారని అన్నారు. 

9 నెలల క్రితమే ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులై టీడీపీని కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారన్నారు.  ప్రజా చైతన్యం ఎంత గట్టిగా ఉంటుందన్నది చంద్రబాబుకు తగిలిన దెబ్బతో యావత్‌ దేశం గుర్తించిందని పేర్కొన్నారు. ఎక్కడైనా విపక్ష పాత్రలో ఉన్నవారు అధికార పార్టీకి కొంత సమయం ఇస్తారని... ఏం చేస్తున్నారో పరిశీలిస్తారని...అవసరమైతే సలహాలు ఇస్తారని... ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి కాస్త వేడి పుట్టించే ప్రయత్నం చేస్తారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తొలి రోజు నుంచి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారరు. 

ముఖ్యమంత్రి జగన్‌ మీద బురద చల్లే కార్యక్రమం, లేనివి ఉన్నట్లుగా ఆపాదించే కార్యక్రమం, ఆయన పరిపాలనను ఒక దుష్ట పరిపాలనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ 9 నెలల్లో ఏం నరకాసుర పాలన చూశారు? అని ప్రశ్నించారు. అమ్మ ఒడి ఇవ్వడం అది నరకాసురుడా? రైతు భరోసా ఇవ్వడం నరకాసురుడా? ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం చేయడం వల్ల నరకాసురుడయ్యాడా? లేకపోతే బడుగు, బలహీన వర్గాల వారు బాగా చదువుకునేలా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అమలు చేయడం వల్ల నరకాసురుడు అయ్యాడా?  అని ప్రశ్నించారు. 

లేదంటే కంటివెలుగు అని చెప్పి పిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు వైద్య పరీక్షలు చేయించడం వల్ల నరకాసురుడు అయ్యాడా?  ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 1000 వైద్యాలను తీసుకువచ్చినందుకు నరకాసురుడు అయ్యాడా? మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే కార్యక్రమం చేస్తున్నందుకు నరకాసురుడు అయ్యాడా? లేదు ఆస్పత్రులను ప్రక్షాళన చేస్తానని చెప్పి, ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టపరుస్తున్నందుకు నరకాసురుడు అయ్యాడా?  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒకేసారి దాదాపు 1.4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నరకాసురుడు అయ్యాడా? అసలు దేనికి నరకాసురుడు అయ్యాడని కన్నబాబు ప్రశ్నించారు.

పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం... దానికి ఈయన భజన బృందాలు, తానా అంటే తందానా అనే బృందాలు వంత పాడడం సహజమేనన్నారు. అందుకే చంద్రబాబు నాయుడికి మేము చెబుతున్నది ఒక్కటే రండి రేపు బడ్జెట్‌ సమావేశాల్లో ఏం మాట్లాడుతారో... ఏం చెప్పదల్చుకున్నారో...అక్కడ చర్చించుకుందాం  అని అన్నారు.