గుంటూరు: కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో గొడవలు చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత విమర్శించారు.

సోమవారం నాడు ఆమె గుంటూరులో మీడియాతో ఆమె మాట్లాడారు.  రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబునాయుడు పాలనలో పల్నాడు ప్రాంతంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకొన్నాయన్నారు.ప్రస్తుతం పల్నాడు ప్రశాంతంగా ఉందన్నారు.

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ గురించి గురవాచారి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఆయనను చిత్రహింసలకు గురిచేశారని మంత్రి గుర్తు చేశారు. 15 రోజుల పాటు గురవాచారి ఎక్కడ ఉన్నాడనే విషయం కూడ తెలియరాలేదన్నారు.

యరపతినేని శ్రీనివాసరావు ఓ వ్యక్తిని కోటి రూపాయాలు ఇవ్వాలని బెదిరించాడని హోం మంత్రి సుచరిత చెప్పారు.ఎన్నికల తర్వాత సుమారు 79 కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు. అందులో టీడీపీ పెట్టిన కేసులు 43 ఉన్నాయన్నారు. యరపతినేని అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని మంత్రి తెలిపారు.

టీడీపీ ఏర్పాటు చేసిన  పునరావాస కేంద్రాల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు వెళ్లి ఆరా తీస్తారని మంత్రి సుచరిత తెలిపారు. నిజమైన బాధితులు ఉంటే వారిని  పోలీస్ రక్షణ కల్పించి ఆయా గ్రామాలకు తీసుకెళ్తామని మంత్రి సుచరిత తెలిపారు.