తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో రెండు రోజుల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్వహించే సమీక్షల కోసం నగరంలోని పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. మాజీ కార్పొరేటర్ ఆళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

చంద్రబాబు జిల్లా నాయకులతో సమీక్షల కోసం రెండో అంతస్తును కేటాయించారు. మూడో అంతస్తును పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది బస చేయడానికి సిద్ధం చేశారు.

టిడిపి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు అంతస్తులను వాడడం లేదు. గ్రౌండు ఫ్లోరులో ఉండే సమావేశమందిరం, మొదటి అంతస్తును మాత్రమే ఉపయోగిస్తున్నారు. పార్టీ అధినేత రాకతో ఈ రెండు అంతస్తులను కూడా ఉపయోగంలోకి వస్తున్నాయి.

అక్టోబర్ 10, 11 తేదీల్లో చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. మొదటిరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని గ్రౌండ్‌ ఫ్లోరులో ఉండే సమావేశ మందిరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

చంద్రబాబు పార్టీ కార్యాలయంలో బసచేసే అవకాశాలున్నాయి. దీనికి అనుగుణంగా ఛాంబర్లు, సమావేశ మందిరాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు, టెలీ కాన్ఫరెన్సు నిర్వహణకు వీలుగా ఒక ఛాంబరు, నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించేందుకు మరో ఛాంబరు అందుబాటులో ఉన్నాయి. 

చంద్రబాబు బసచేయడానికి వీలుగా ప్రత్యేకంగా పడక గది అందుబాటులో ఉంది. అక్కడ వసతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు 10వ తేదీ రాత్రి ఇక్కడ బస చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ బస చేయడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.