అమరావతి: కడప, పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా)ల అభివృద్దిపై ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందులపై మరిన్ని వరాలు కురిపించారు. ఇక్కడ ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బోధనను అందించే ఒక స్కూల్‌ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. అలాగే ఓ టౌన్‌ హాల్ ను కూడా నిర్మించాలని... అందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఇక ఇప్పటికే చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. పులివెందులలో మెడికల్‌ కాలేజీ పనుల గురించి అడగ్గా నిర్మాణం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నామని అధికారులు తెలియజేశారు. అలాగే క్యాన్సర్‌ హాస్పిటల్, ఇతరత్రా అభివృద్ధి పనులపై సీఎం అధికారులతో చర్చించి పలు సలహాలు, సూచనలిచ్చారు.  

read more  చంద్రబాబు జైలుకే... ఆ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన అక్రమ సంపాదనే...: రామచంద్రయ్య

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, కడప, పులివెందుల ప్రాంతాలకు చెందిన అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. శాఖలవారీగా చేపడుతున్న పనులు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్‌ పనులను ఆయన సమీక్షించారు. ఇవేకాక ఇటీవల ముఖ్యమంత్రి చేసిన శంకుస్థాపనలకు సంబంధించిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

వివిధ పనుల ప్రగతి, నిధుల ఖర్చు, ఇతరత్రా అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్‌ స్టోరేజీలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఫుడ్‌ ప్రాససింగ్‌ జోన్లపై మ్యాపింగ్‌ చేయించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

స్కిల్‌ డెవలప్‌ సెంటర్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే ఈసారి వరద నీళ్లు వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి తప్పనిసరిగా నిండాలన్నారు. ఆమేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు వరకూ రోడ్డు విస్తరణ పనులపై దృష్టిపెట్టాలని... ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. 

read more  డిల్లీలో బిజెపి ఘోర పరాజయానికి కారణం జగనే...ఎలాగంటే..: బుద్దా వెంకన్న

ఖర్జూరం పెంపకంపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారన్న అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయంలో వాతావరణం, ఖర్చులు ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు  సీఎంకు వివరించారు. దీనిపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు.

చిరుధాన్యాలను బాగా ప్రమోట్‌ చేయాలన్నారు సీఎం. ఏపీ కార్ల్‌లో ఉన్న మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వెటర్నరీ, హార్టికల్చర్‌ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. ఒక వారంరోజుల్లో దీనిపై ఒక ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.