టిడిపికి మరో షాక్... బిజెపి గూటికి కీలక నాయకురాలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నాయకురాలు సాదినేని యామిని తాజాగా బిజెపి గూటికి చేరారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీకి గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కోక్కరుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ షాకిస్తున్నారు. ఇలా తాజాగా ఒకప్పటి టిడిపి ఫైర్ బ్రాండ్, అధికార ప్రతినిధిగా పనిచేసిన సాదినేని యామిని శర్మ అధికారికంగా భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోన ఓటమి చవిచూసింది. దీంతో వెంటనే యామిని ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికే కాదు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇలా టిడిపికి దూరమైన ఆమె ఏ పార్టీలో చేరకపోయినా బిజెపిలో చేరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పలుమార్లు ఆమె ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడమే ఈ అనుమానాలకు కారణమయ్యాయి.
అయితే అందరూ అనుకున్నట్లే ఎట్టకేలకు యామిని కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర అధ్యక్షులు కన్నాతో పాటు ఇతర బిజెపి పెద్దల సమక్షంలో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ఆమెకు పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి చేర్చుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో యామిని టిడిపి తరపున పెద్దఎత్తున ప్రచారం చేపట్టారు. టీవి డిబేట్స్ లో, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలు వైసిపి, జనసేనలపై విరుచుకుపడ్డారు. ఓ దశలో టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు కూడా ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదు. పార్టీ అభ్యర్థుల తరపున మాత్రం ఆమె విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు.
అయితే ఈ స్థాయిలో కష్టపడ్డా టిడిపి ఓటమి చవిచూడటంతో యామిని ఒక్కసారిగా సైలెన్స్ అయిపోయారు. తాజాగా ఆమె బిజెపిలో చేరి మరో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.