రాంచీ: తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోవడాన్ని మళ్లీ చూడదల్చుకోలేదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. శుక్రవారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కోహ్లీ సెంచరీ చేసినా ఓటమి నుంచి భారత్ తప్పించుకోలేకపోయింది.

తమ అంచనాలు తప్పడం వల్లే ఓటమి చవిచూశామని, తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయానికి అర్హులని కోహ్లీ మ్యాచ్ ఫలితంపై అన్నాడు. రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని తమకు ఎవరో చెప్పారని, అందుకే ముందు బౌలింగ్‌ ఎంచుకున్నామని, కానీ అలాంటిదేమీ జరగలేదని అన్నాడు. 

ఆరంభంలోనే ఇలా తాము గతంలో వికెట్లు కోల్పోలేదని, మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగిందని, ఇక మీదట ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదని అన్నాడు. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తామని చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌లకు మార్పులు ఖాయమని సంకేతాలు ఇచ్చాడు. 

చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంపై కసరత్తులు చేస్తామని, తాను ఆడిన మంచి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి అని అన్నాడు. మూడు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చినప్పుడు తాను తన ఆటను ఆడుతానని, తర్వాత ఏం జరుగుతుందనేది తనకు అనవసరమని అనుకున్నానని వివరించాడు. ఇదే రీతిలో షాట్స్‌ ఆడానని, కానీ తాను అవుట్ కావడం నిరాశను మిగిల్చిందని అన్నాడు. 

తాము గెలుస్తామని అనుకున్నా గానీ ఆసీస్‌ ఆటగాళ్లు తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చారని, ఆడమ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, వారు ఈ విజయానికి అర్హులని కోహ్లీ అన్నాడు.