మొహాలీ వన్డేలో కష్టసాధ్యమైన 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించి సిరీస్‌ను సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ఓటమికి వికెట్ కీపర్ రిషభ్ పంతే కారణమంటూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.

ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్‌మెంట్ ఆసీస్‌తో చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినిచ్చారు. దీంతో అతని స్థానంలో రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినప్పటికీ... కీపింగ్‌లో అతని డొల్ల తనం బయటపడింది.

సులువైన క్యాచ్‌తో పాటు రెండు కీలక స్టంపౌట్‌లను చేజార్చి అతను భారత విజయావకాశాలను దెబ్బ తీశాడు. ఓ స్టంపౌట్‌ను ధోని స్టైల్‌లో చేయబోయి విఫలమవ్వడంతో గ్రౌండ్‌లోని ప్రేక్షకులు ఆ సమయంలో ధోని..ధోని అంటూ నినాదాలు చేశారు.

ఇక విరాట్ కోహ్లీ అయితే పంత్ పట్ల అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు రిషబ్ పంత్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. అంపైర్.. ఇప్పుడు పంత్‌ను మార్చవచ్చా అని కోహ్లీ అడుగుతున్నట్లుగా ఉన్న మీమ్ వైరల్ అవుతోంది.

మరికొందరైతే ‘‘ ప్రతి ఒక్కడు ధోని కాలేడబ్బా... ధోనిని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.. అందుకే పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దు అంటూ డిమాండ్ చేశారు. అసలు సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ను ఎందుకు ఎంపిక చేయడం లేదని కొందరు ప్రశ్నించారు.