టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యే దశకు వచ్చినా అతని ఆటలో ఏమాత్రం పదను తగ్గలేదు. ఈ మధ్యకాలం తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేక విమర్శకుల చేత నానా మాటలు పడ్డాడు.

అయితే ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్‌లలో అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌లలో రాణించి తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ క్రమంలో ధోనిని ఒక ఘనత ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మార్కును చేరడానికి ధోని కొద్దిదూరంలో నిలిచాడు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌‌లో 16,967 పరుగులు చేసిన ధోని... ఆసియా ఎలెవన్ మ్యాచ్‌లతో కలుపుకుని మొత్తం 528 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 16 సెంచరీలు, 106 అర్థసెంచరీలు ఉన్నాయి.

బ్యాటింగ్ సగటు 45.00 శాతం. 90 టెస్టుల్లో 4,876 పరుగులు చేసిన ధోనీ, 340 వన్డేల్లో 10,474 పరుగులు చేశాడు.. 98 టీ20లలో 1,617 పరుగులు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (34,357), రాహుల్ ద్రావిడ్ (24,208), విరాట్ కోహ్లీ (19,453), సౌరవ్ గంగూలీ (18,575), వీరేంద్ర సెహ్వాగ్ (17,253) పరుగులతో ధోని కన్నా ముందున్నారు.