ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ ద్వారా భారత జట్టు ఖాతాలోకి అత్యంత చెత్త రికార్డు చేరింది. మొహాలీ వేదికగా జరిగిన నాలుగొ వన్డేలో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 358 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి వాటిని కాపాడుకోవడంలో విఫలమయ్యింది. ఇలా 350 కి పైగా పరుగులు సాధించిన మ్యాచుల్లో భారత్ మొదటిసారి ఓటమిని చవిచూసింది. 

గతంలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసిస సందర్భాల్లో ఐదుసార్లు 350 పైచిలుకు పరుగులు సాధించింది. అయితే ఇలా భారీ స్కోరు సాధించిన ప్రతిసారీ భారత్ దే విజయం. ఈ పరుగులను కాపాడుకోవడంలో టీమిండియా ఎప్పుడూ విఫలం కాలేదు. కానీ స్వదేశంలో ఆసిస్ పై జరిగిన నాలుగో వన్డేలో మొదటిసారిగా 358 ని కాపాడుకోలేక ఓటమిపాలయ్యింది. దీంతో భారత్ వన్డే చరిత్రలో 350 పరుగులను కాపాడుకోలేని మ్యాచ్ గా మొహాలీ వన్డే నిలిచింది. 

 మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ తమ ముందు ఉంచిన 359 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. హ్యాండ్స్ కోంబ్ సెంచరీతో అదరగొట్టగా, చివరలో టర్నర్ మ్యాచు ఫలితాన్నే టర్న్ చేశాడు. అతను ఆరు సిక్స్ లు ఐదు ఫోర్లతో 43 బంతుల్లో 84 పరుగులుచేసి అజేయంగా నిలిచాడు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్ 2-2తో సమమైంది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. భారత ఓపెనర్లు రాణించినప్పటికీ టెయిల్ ఎండర్లు విఫలమయ్యారు. అయినప్పటికీ భారీ స్కోరునే సాధించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఐదో వన్డే ఇరు జట్లకు కూడా కీలకం కానుంది.