నాగ్ పూర్ వన్డే  ద్వారా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున అంతర్జాతీయ వన్డేల్లో రెండు వేల పరుగులను పూర్తిచేసుకోవడంతో పాటు 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి జడేజా చేరిపోయాడు.ఇప్పటివరకు ఈ ఘనతను ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మాత్రమే సాధించగా జడేజా వారి సరసన చేరి మూడో ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. 

నాగ్‌పూర్ లో ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో జడేజా 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు వన్డేల్లో రెండు వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు.  అంతేకాకుండా  అతడు వన్డే మ్యాచుల్లో ఇప్పటివరకు 172 వికెట్లను కూడా పడగొట్టాడు. దీంతో అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు.

ఇలా వన్డేల్లో రెండు వేల పరుగులు సాధించి 150 కి పైగా వికెట్లు పడగొట్టిన మొదటి ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిలిచాడు. కపిల్ దేవ్ వన్డేల్లో 3,782 పరుగులతో పాటు 253 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాత మళ్లీ సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించాడు. సచిన్ తన వన్డే కెరీర్లో 18,426 పరుగులతో పాటు 154 వికెట్లు పడగొట్టాడు. 

వీరిద్దరి తర్వాత మళ్లీ ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఇలా నాగ్ పూర్ వన్డే ద్వారా జడేజా లెజెండరీ క్రికెటర్స్ కపిల్ దేవ్, సచిన్ ల సరసన చేరాడు.