నాగ్ పూర్ వన్డేలో టీమిండియా యువ క్రికెటర్ విజయ్ శంకర్ ని దురదృష్టం వెంటాడింది.  తన వన్డే కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీ సాధించడానికి చేరువైన సమయంలో అనూహ్యంగా అతడు రనౌటయ్యాడు. ఇలా శంకర్ వన్డేల్లో బెస్ట్ స్కోరు సాధించినా ఆనందం లేకుండా పోయింది. 

75 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి మెల్లిగా కష్టాల్లోకి జారుకుంటున్న సమయంలో కోహ్లీకి శంకర్ తోడుగా నిలిచాడు. దీంతో మరో వికెట్ పడకుండా వీరిద్దరు జాగ్రత్త పడుతూనే స్కోరును పెంచుతూ వెళ్లారు. ఈ క్రమంలోనే కోహ్లీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా శంకర్ కూడా తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీ సాధించడానికి చేరువయ్యాడు. 

అయితే ఈ క్రమంలో శంకర్ ను దురదృష్టం వెంటాడింది. అతడు 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వుండగా జంపా బౌలింగ్ లో రనౌటయ్యాడు. జంపా వేసిప 29వ ఓవర్లో కోహ్లీ  బ్యాటింగ్ చేస్తుండగా శంకర్ మరో ఎండ్ లో వున్నాడు. అయితే ఈ ఓవర్లో ఐదో బంతిని కోహ్లి స్ట్రైట్‌ డ్రైవ్‌ కొట్టాడు. అది కాస్తా జంపా చేతి వేళ్లకు తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. అయితే ఆ సమయంలో  నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో వున్న విజయ్‌ క్రీజ్ లో నుంచి కొద్దిగా ముందుకు వచ్చి వున్నాడు. దీంతో అతడు రనౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. 

దీంతో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శంకర్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.  అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యుత్తమ స్కోరు. అయితే మొదటి హాఫ్ సెంచరీని సాధించే అవకాశాన్ని మాత్రం కేవలం 4 పరుగుల తేడాతో విజయ్ తృటిలో కోల్పోయాడు.