ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగనున్న చివరి రెండు వన్డేలకు సీనియర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికి జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ధ్రువీకరించారు.

రానున్న ప్రపంచకప్‌‌ను దృష్టిలో ఉంచుకుని మహీకి విశ్రాంతినిస్తున్నట్లు తెలిపాడు. అతని స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ జట్టులోకి రానున్నాడు. పనిభారం వల్ల ఒత్తిడి లేకుండా చూడటం కోసం ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోహ్లీ బీసీసీఐ సూచించిన విషయం తెలిసిందే.

గత ఏడాది 20 మ్యాచ్‌ల్లో కేవలం 275 పరుగులు మాత్రమే చేసిన ధోనీ.. 2019లో జూలు విదిల్చాడు. ఆస్ట్రేలియాలో వరుసగా మూడు అర్థసెంచరీలు బాది... ఆసీస్ గడ్డపై భారత్ తొలి ద్వైపాక్షిక సిరీస్‌‌ గెలవడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గాను ఎంపికయ్యాడు.

న్యూజిలాండ్ సిరీస్‌లో ధోనీకి బ్యాటింగ్ అవకాశాలు రాలేదు. అదే సిరీస్‌లో బుమ్రాకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.... కివీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్ నుంచి కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు.