భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటికే టీ20 సీరిస్ ముగియగా మార్చి 2 నుండి వన్డే సీరిస్ ప్రారంభంకానుంది. అయితే సీరీస్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. కొద్దిరోజుల క్రితమే తమ స్వదేశంలోనే టెస్ట్, వన్డే సీరిస్ ను ఓడించిన భారత్ పై ప్రతీకారం తీర్చచుకకోవాలని ఆసిస్ భావిస్తోంది. అయితే విశాఖ, బెంగళూరు టీ20లో ఓడించి సీరిస్ ను కైవసం చేసుకున్న ఆసిస్ ను వన్డే సీరిలో ఓడించి పరువు కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది. ఇలా ఇరు జట్లు ప్రతిష్టాత్మంగా బరిలోకి దిగుతుండంతో హైదరాబాద్ వన్డే అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.  ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయంటేనే అభిమానుల్లో దీనిపై ఎంతగా ఆసక్తి నెలకొని వుందో అర్థమవుతుంది. 

దీంతో మ్యాచ్ ను చూడటానికి వచ్చే అభిమానులకు రాచకొండ సిపి పలు సూచనలు చేశారు. దాదాపు 38 వేలకు పైచిలుకు అభిమానులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి రానున్నట్లు సిపి తెలిపారు. వీరంతా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల ఆంక్షలను తప్పకుండా పాటించాల్సి వుంటుందని సూచించారు. ఉళ్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని సిపి హెచ్చరించారు. 

ముఖ్యంగా ఆటగాళ్ల  భద్రతను దృష్టిల్ో వుంచుకుని స్టేడియంలోకి కొన్ని  వస్తువులను తీసుకెళ్లకుండా నిషేధించినట్లు వెల్లడించారు. సిగరెట్టు, అగ్గిపెట్టెలు, బ్యానర్లు, నగదు నాణేలు, పెన్నులు, సెల్ ఫోన్ చార్జర్లు, బ్యాగులతో  పాటు వాటర్ బాటిల్స్, తిను బండాలను కూడా స్టేడియంలోకి అనుమతించబోమని వివరించారు. కేవలం సెల్ ఫోన్ల ను మాత్రమే అనుమతిస్తున్నట్లు సిపి స్పష్టం చేశారు. 

అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు, తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం వుండటంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి ఉప్పల్ వైను వెళ్లే భారీ వాహనాలను హబ్సిగూడ నుండి  దారి మళ్లించనున్నట్లు,  అలాగే ఎల్‌బి నగర్ వైపునుండి వచ్చే భారీ వాహనాలను బోడుప్పల్ వద్ద దారి మళ్లించనున్నట్లు సిపి తెలిపారు. వాహనదారులు ఈ సూచనలను గమనించాలని సిపి పేర్కొన్నారు. 

ఇక వ్యక్తిగత వాహనాల్లో మ్యాచ్ ను వీక్షించచేందుకు స్టేడియం వద్దకు చేరుకునే అభిమానులు నిర్దేశిత ప్రాంతాల్లోనే  వాహనాలను పార్క్ చేయాలన్నారు. వెహికిల్ పాస్ వున్న వాహనాలను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని మహేష్ భగవత్ వెల్లడించారు.