ఇంగ్లాండ్ వేదికన ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ కప్ ట్రోపీని భారత్ ఎగరేసుకుపోవడం ఖాయమని మాజీ టీమిండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ ల మద్య ఈ టోర్నీలో ప్రధాన పోటీ వుంటుందని...అయితే ట్రోపీ మాత్రం టీమిండియానే సాధిస్తుందన్నారు. ఇలా భారత్ ఖాతాలోకి మూడో ప్రపంచకప్ చేరనుందని గవాస్కర్ జోస్యం చెప్పారు. 

భారత్ ప్రపంచ కప్ సాధించడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని,  ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించనున్నారని గవాస్కర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వీరిద్దరు మంచి అండస్టాండింగ్ తో జట్టును ముందుకు నడిపించగలన్న నమ్మకం తనకుందన్నారు. ధోని సలహాలు, సూచనలను కోహ్లీ గౌరవిస్తాడు కాబట్టే వీరి మధ్య మంచి అండస్టాండింగ్ ఏర్పడిందని తెలిపారు. 

మైదానంలో వ్యూహాలు రచించడంలో ధోని చాలా అనుభవజ్ఞుడని...అందువల్లే అతడు ఖచ్చితంగా ఫలితాన్నిచ్చే ప్రయోగాలను మాత్రమే చేస్తాడన్నారు.  ఆ విషయం కోహ్లీకి తెలుసు కాబట్టే ధోనికి ఆ స్వేచ్చ ఇస్తున్నాడన్నారు. మ్యాచ్ చేజారిపోతున్న సమయంలో కూడా  ఒకే ఒక్క నిర్ణయంతో పరిస్థితులను మార్చగల సామర్ధ్యం ధోనికి వుందని  గవాస్కర్ ప్రశంసించాడు. కోహ్లీ, ధోని అండస్టాండింగే మూడో ప్రపంచకప్ తెచ్చిపెడుతుందన్న నమ్మకం తనకుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 

బ్యాటింగ్ విభాగంలో ఎప్పుడూ పటిష్టంగానే వుండే టీమింండియాకు బౌలింగే సమస్య. అయితే ప్రస్తుతం ఆ విభాగంలో కూడా జట్టు మెరుగ్గానే కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా బుమ్రా, భవనేశ్వర్, షమీ వంటి బౌలర్లతో భారత బౌలింగ్ విభాగం మెరుగ్గానే కనిపిస్తోందన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే ప్రపంచ కప్ లో భారత్ కు తిరుగులేదని అనిపిస్తోందని గవాస్కర్ తెలిపారు.