రాంచీ వన్డేలో సెంచరీ చేయడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం కోహ్లీని ఆకాశాకెత్తెశాడు.

క్రికెట్ లెజెండ్‌ సచిన్ టెండూల్కర్ కన్నా విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడన్నాడు. అయితే కోహ్లీ కేవలం వన్డేలకు మాత్రమే అత్యుత్తమ ఆటగాడని మెలిక పెట్టాడు. తన ఆటతీరుతో అనేక రికార్డుల్ని బద్ధలు కొట్టి.... ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న సచిన్, లారాలను కోహ్లీ వెనక్కి నెట్టేశాడని వాన్ అభిప్రాయపడ్డాడు.

కొద్దిరోజులుగా కోహ్లీ, సచిన్‌లో బెస్ట్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 41వ సెంచరీ సాధించి.. సచిన్ అత్యధిక సెంచరీల రికార్డుకు కొద్దిదూరంలో నిలిచాడు.

అయితే భీకర ఫాంలో ఉన్న కోహ్లీ త్వరలోనే ఆ రికార్డును బద్ధలు కొట్టే అవకాశం ఉందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఐసీసీ వన్డే, టెస్టుల్లో కోహ్లీ నెంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.