టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ ఒక అద్భుతం.. సచిన్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలంతా ఒక్కొక్క సమయంలోనే గొప్పగా ఆడారు.. కానీ కోహ్లీ మాత్రం చాలా సులువుగా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నాడు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కఠినమైన పిచ్‌పై అతడి ఆట అద్భుతం.. అతడి బ్యాటింగ్ చూస్తుంటే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందేమోనని అనిపించింది. అన్ని వైపులా బౌండరీలు బాదాడు.. జట్టును గెలిపించడానికి చివరి వరకు పోరాడాడని ప్రశంసించాడు.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య రాంచీలో జరిగిన మూడో వన్డేలో ఆసీస్ నిర్దేశించిన 314 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన భారత జట్టులో ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూకట్టారు.

ఈ సమయంలో పట్టుదలతో ఆడిన విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కోహ్లీ ఆటతీరుపై క్రికెట్ అభిమానులు, మాజీలు భారత సారథిని అభినందిస్తున్నారు.