టీ20ల ఎంట్రీతో క్రికెట్ రూపు రేఖలు మారిపోయాయి. గంటల్లోనే ఫలితం తేలిపోవడం, కావాల్సినంత మజా వస్తుండటంతో అభిమానులు టీ20ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో సంప్రదాయక టెస్టు క్రికెట్ కనుమరుగు కాబోతోందని వస్తున్న వార్తలు తప్పని తేలింది.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో టెస్టు క్రికెట్‌కు 86 శాతం మంది ఓటేశారు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ 100 దేశాల్లో, 13 వేల మందిపై సర్వే చేయగా.. తమకు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టులు చూడటం కూడా ఇష్టమేనని వెల్లడించారు.

అంతే కాకుండా టెస్టు క్రికెట్ విజయవంతం కావడానికి పలు సూచనలు కూడా ఇచ్చారు. మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న టికెట్ల వివరాల్ని, ధరతో పాటు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు.

ఐదు రోజుల మ్యాచ్‌ల్ని ఉచితంగా వీక్షించేందుకు ఫ్రీ టు ఎయిర్ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కేవలం పెయిడ్ ఛానెళ్లలో మాత్రమే ప్రసారమవుతున్నాయన్నారు. రోజు మొత్తానికి బదులు హాఫ్ డే టిక్కెట్లు విక్రయించాలని సర్వేలో పాల్గొన్న అభిమానులు తెలిపారు.